"ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము..."
రాయప్రోలు వారి మాటలను నిజం చేస్తూ ఎందరో ప్రవాసాంధ్రులు ప్రపంచంలోని పలు దేశాలలో ప్రముఖ స్థానాలలో నిలిచి మన పేరు ప్రఖ్యాతులను ఇనుమడింప చేస్తున్నారు. తమవైన ప్రత్యేకతలను నిలుపుకుంటూనే తమ చుట్టూ ఉన్న వాతావరణంలో కలిసిపోతూ, తర్వాతి తరాల వారికి కల్తీ లేని వారసత్వ సంపదనూ అందుబాటులో ఉంచాలనే తాపత్రయానికి తోడ్పాటుగా నేడు అంతర్జాలంలో తెలుగు భాషాభిమానులు ఎంతో కృషి చేస్తున్నారు. అంతర్జాలంలోని తెలుగు వెలుగులలో బాలల కోసం ప్రసరిస్తున్న కొన్ని కిరణాలు: ఆంధ్రభారతి వారి బాలభాష లోని “బాల” విభాగమే కాక శతకములు విభాగం కూడా ఆసక్తికరం. ఇక్కడ ఉన్నన్ని శతక పద్యముల సంగ్రహం నేను ఇంతవ్రకు అంతర్జాలంలో ఎక్కడా చూడలేదు. ఇవి అన్నీ “పిల్లల కోసం” అని కాదు కాని, ఇన్ని పద్యాలు ఒక చోట లభ్యమైనప్పుడు అందులో పిల్లలకు తగినవి ఎంచుకుని నేర్పడం కొంచెం సులభమవుతుంది కదా అని నా అభిప్రాయం. ఇంకొక ఆసక్తి కరమైన విషయం ఏంటంటే “దేశి”, “కవితలు” విభాగాలలో కూడా వెతుక్కుంటే పిల్లలకు నచ్చేవి, నప్పేవి కనిపిస్తాయి. అలా నాకు దొరికినది చావలి బంగారమ్మ గారి “పాప” కవిత. మాగంటి సేకరణలో బహుశా ప్రథమ స్థానం వీరిదేనేమో. ఇక్కడ “చిన్నారులు” విభాగంలో ఎన్నో అమూల్యమైన పద్యాలు, పాటలు, కథలు, పొడుపు కథలు, ఇంకా ఎన్నెన్నో పోగు చేసి ఉంచారు. సాహిత్యంగా దొరికేవే కాక తర తరాలుగా పెద్ద వారి నుండి చిన్న వారికి ముఖతా అందిన ఆణిముత్యాల వంటి కథలు, పాటలు మన పిల్లలకు ఉపయోగ పడడమే కాక, మనను, ఒక్క సారి మన బాల్యానికి తీసుకు వెళ్ళి జ్ఞాపకాల వీధులలో తిప్పుతాయి. స్తోత్రలహరి వారి బాలలహరి ఇక్కడ పిల్లల విభాగంలో పెద్ద బాల శిక్ష ఉంది. కొన్ని సరళమైన ప్రార్థన పద్యాలు ఉన్నాయి. బబ్లూ ఇక్కడ అచ్చులతో పదాలు, పళ్ళు, జంతువులు, వాహనాలు వంటి పదజాలం, వాటితో చిన్న చిన్న వాక్యాలు, కొన్ని కథలు ఉన్నాయి. అన్నిటికీ బొమ్మలు, మాటలు ఉన్నాయి. తెలుగుదనం వీరు చిన్న పిల్లల కోసం పాటలు, కథలు, పాఠాలు సమీకరిస్తున్నారు. ఇందులో నాకు అత్యంత ఉపయోగకరమైన అంశం పదజాలం (vocabulary) అనిపిస్తుంది. తెలుగులో పిల్లలకై ఉద్దేశించినవి కాకున్నా, పిల్లలతో పాటు సందర్శించగలిగిన సైట్లు: కొత్తపల్లి - పిల్లల మాస పత్రిక ఆసక్తికరమైన ప్రయోగం. పుస్తక రూపంలో కూడా లభ్యం. పెద్దలూ, పిల్లలూ ఈ పత్రికకి రచనలు పంపవచ్చు. జోల పాటలు - "అమ్మ దొంగా, నిన్ను చూడకుంటే నాకు బెంగ" - ఈ పాట గుర్తున్న వారు వెంటనే ఈ లంకె వైపు పరిగెత్తండి. ఈ పాట ఇప్పటి వరకూ విని ఉండక పోతే ఇప్పుడైనా తప్పనిసరిగా విని చూడండి. తెలుగు ప్రముఖులనుంచి పల్లెటూళ్ళ దాకా విశేషాలు, విషయాలూ ఇక్కడ తెలుసుకోవచ్చు, తెలియచేయవచ్చు. | Look up Telugu words Telugu meanings for English words
|